Prathidwani: వివాదాస్పదంగా వాలంటీర్ వ్యవస్థ.. 'కలెక్టర్లకు సీఈసీ హెచ్చరిక' - volunteers involve in voter list
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-08-2023/640-480-19183300-364-19183300-1691158598223.jpg)
Prathidwani: రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కేంద్రంగా మొదలైన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా తీసుకుంటూ.. అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారన్న దుమారం... ఓటర్ల జాబితాలో లోటుపాట్ల రూపంలో పతాకస్థాయికి చేరింది. దీనికి కొనసాగింపుగానే.. జగన్ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ వద్దని గట్టి హెచ్చరిక చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరైనా వాలంటీర్లు జోక్యం చేసుకుంటే కలెక్టర్లపై చర్యలు ఉంటాయని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అసలు వాలంటీర్ల పాత్ర ఎందుకు ఇంత వివాదం అయింది? వాళ్లు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు? మరి ఈసీ అంత తీవ్ర ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇంతకు ముందే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి... వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టమని చెప్పినా సర్కార్ ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు కంప్లయింట్ కేంద్ర ఎన్నికల సంఘం దాకా వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? ఇప్పుడు ఈసీ ముందున్న కర్తవ్యం ఏమిటి? అసలు వాలంటీర్లు ఎవరు? ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వారెలా నిర్ణయిస్తారు? ఈ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? ఇవి గతంలో రాష్ట్ర హైకోర్టు జగన్ సర్కార్‌కు సంధించిన ప్రశ్నలు. ఇప్పుడా పరిధి కూడా దాటి ఓటర్ల జాబితాలనూ వారి చేతుల్లో పెడుతున్న ప్రభుత్వతీరుని ఏమనుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.