టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
🎬 Watch Now: Feature Video
Political Strategist Prashant Kishor Meets TDP Chief Chandrababu Naidu:ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లారు. లోకేశ్ కారులోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ వెళ్లటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు - ప్రశాంత్ కిషోర్ భేటీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. ఇటీవల యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన నారా లోకేశ్, పార్టీ ఎన్నికల సన్నద్ధతపై వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్‌తో పాటు రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి దారితీసే పరిస్థితులపై ఇప్పటికే ఐ ప్యాక్ టీం జగన్‌కు పలు నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుడు విధానాలు, ప్రజావ్యతిరేకతపై పీకే బృందం పలు నివేదికలు జగన్‌కు అందజేసింది. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. రాష్ట్రంలో మారిన పరిస్థితులు, ఆయా వర్గాల్లో వ్యతిరేతపై జగన్‌కు నివేదించింది. ప్రశాంత్ కిషోర్ సూచనలను, హెచ్చరికలను సీఎం జగన్ పట్టించుకోలేదనే చర్చ జరుగుతుండగా తాజాగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీపై ఉత్కంఠ నెలకొంది.