Police Stopped Lunch to Lokesh: లోకేశ్‌కు భోజనం తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత - Tadepalli Pathur road Dispute
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 3:33 PM IST
Police Stopped Lunch to Lokesh: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భోజనం తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఈడీ విచారణకు హాజరైన లోకేశ్‌కు.. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టంచేసింది. అయినా పట్టించుకోకుండా భోజనం తీసుకెళ్లే వాహనాన్ని చాలాసేపు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై పోలీసులు ఆపేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించారు. ఆ తర్వాత భోజనం తీసుకెళ్లేందుకు అనుమతించారు. ఇక తాడేపల్లి - పాతూరు రోడ్డులో పోలీసు ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వీస్ రోడ్డు వద్దే బారికేడ్లు పెట్టడంతో అటువెళ్లే వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ లోకేశ్‌కు సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేశ్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో ఈ మేరకు విచారణ జరగనుంది. విచారణ సమయంలో లోకేశ్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే విచారించాలని.. మధ్యాహ్నం ఓ గంట భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశించింది. హెరిటేజ్ సంస్థకు లబ్ధిచేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది. లేని, వేయని, కనీసం భూసేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమని తెలుగుదేశం నిలదీస్తోంది. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర విభజనకు ముందు హెరిటేజ్ సంస్థ కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది.