Shankar Vilas Flyover Works Started In Guntur : గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్‌విలాస్ వంతెన నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కేంద్రం రూ. 98 కోట్ల నిధులు మంజూరు చేసింది. రహదారి విస్తరణకు సంబంధించిన ప్రాథమిక చర్యల్ని నగరపాలక సంస్థ ప్రారంభించింది. అయితే స్థానిక వ్యాపారులు కొన్ని మార్పులను అధికారుల ముందుంచారు. వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ గుంటూరు నగరంలో వాహనదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ముఖ్యంగా పాత, కొత్త గుంటూరును అనుసంధానించే శంకర్ విలాస్ వంతెన వద్ద వాహనాల ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన పాతపడిపోవటంతో పాటు ప్రస్తుత వాహనాల రద్దీని తట్టుకునేలా లేదు. ఫ్లైఓవర్ వెడల్పు కేవలం రెండు వరుసలు మాత్రమే కావటంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఫ్లైఓవర్ దాటి వెళ్లటం వాహనదారులకు పరీక్షగా మారింది. ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపలేదు.
సాధారణ ఎన్నికల సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ నగరంలో ఫ్లైఓవర్లపై ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన ఎంపీగా గెలవటం, కేంద్ర మంత్రి కావటంతో నగరంలో శంకర్ విలాస్ ఫైఓవర్ మొదటి ప్రాధాన్యంగా మంజూరు చేయటంలో కృషి చేశారు. 98 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించనున్నారు. ఫ్లైఓవర్‌కు సంబంధించి డీపీఆర్ తయారీ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖ చేపట్టింది.
పెమ్మసాని చొరవతో నంది'వెలుగులు' - కష్టాలు తీరతాయని ప్రజలు ఆశాభావం
ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ఫ్లై ఓవర్‌కు అటూ ఇటూ సర్వీస్ రోడ్ల కోసం కొంత మేర భూ సేకరణ చేయాల్సి ఉంది. దీనికోసం అక్కడి దుకాణాలను కొంతమేర తొలగించాలి. అయితే రహదారుల వెడల్పు 120 అడుగులు కాకుండా 100 అడుగులకు కుదిస్తే భవనాలు తొలగించకుండానే పైవంతెన నిర్మించవచ్చని స్థానికులు అధికారులకు సూచించారు.
'శంకర్‌విలాస్ వంతెన నిర్మాణానికి 134 మంది నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఏ యజమాని నుంచి ఎంత స్థలం సేకరిస్తారో మార్కింగ్ ఇచ్చి కొలతలు తీశారు. ఇందులో 14 ప్రభుత్వ భవనాలు, 21 మిషనరీ ఆస్తులు ఉన్నాయి. యజమానులతో సమావేశాలు నిర్వహించి వంతెన నిర్మాణం ఆవశ్యకత, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను కమిషనర్ వివరించారు. ఆస్తులు కోల్పోయే యజమానులకు స్థల విలువకు నాలుగు రెట్లు విలువైన టీడీఆర్ బాండ్లు ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి నెలలో భవనాల కూల్చివేత పనులు వేగవంతం చేసి మార్చి నాటికి వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నాం.' - పులి శ్రీనివాసులు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్
ఫ్లైఓవర్ నిర్మాణం మొదలైతే నగరంలో ట్రాఫిక్ మళ్లించాల్సి ఉంటుంది. పాత వంతెన తొలగించి కొత్తది పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణకు జీఎంసీ, పోలీసు యంత్రాంగం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూడు వంతెనల మార్గాన్ని ఫిబ్రవరి 10 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం - మిథున్‌రెడ్డి ప్రశ్నకు గడ్కరి వివరణ