Plastic Ban in Annavaram Temple: అన్నవరంలో ప్లాస్టిక్ నిషేధం.. కట్టుదిట్టంగా తనిఖీలు..
🎬 Watch Now: Feature Video
Plastic Ban in Annavaram Temple: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి కొండపైన ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్యాకెట్లు, గ్లాసులు విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించారు. కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ స్థానంలో గాజు, మొక్కజొన్న గింజలతో తయారు చేసిన నాన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో మాత్రమే నీటిని విక్రయించేందుకు దుకాణదారులకు.. అధికారులు అనుమతించారు. టీటీడీలో మాదిరిగా.. గాజు సీసాలో నీటిని రూ.60లకు విక్రయించనున్నారు. వినియోగం తర్వాత ఖాళీ గాజు బాటిల్‌ను ఏ దుకాణంలో ఇచ్చినా రూ.40 తిరిగి ఇస్తారు. టీటీడీలో ప్రస్తుతం ఈ విధానమే అమలులో ఉంది. అదేవిధంగా నాన్ ప్లాస్టిక్ బాటిల్లో రూ.40లకు నీరు అందించేందుకు అనుమతించారు. భక్తులు కొండపైకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకురాకుండా అధికారులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు తమతోపాటు తీసుకుని వచ్చిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను స్వచ్ఛందంగా కొండ దిగువన టోల్ గేట్ వద్దే పడేస్తున్నారు.