అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది?: లోకేశ్ - anganwadi workers
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 4:15 PM IST
Nara Lokesh Fires on AP Govt: అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యమంపై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం జగన్ నియంత పోకడలకు పరాకాష్ట అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని లోకేశ్ స్పష్టంచేశారు.
ఎస్మా (Essential Services Maintenance Act) చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డిమాండ్ల పరిష్కారానికి 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు పేర్కొంది.