ఉత్పత్తి ప్రారంభించకుండానే ఇండోసోల్ కంపెనీకి 8వేల ఎకరాలు కట్టబెట్టారు: నాదెండ్ల మనోహర్ - ఇండోసోల్ కంపెనీపై నాదెండ్ల మనోహర్ ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 8:23 PM IST
Nadendla Manohar on Govt Provided Facilities to Indosol Company: ఇండోసోల్ కంపెనీకి ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఏ సంస్థకు లేని అనుచిత లబ్ది కల్పించడం వెనుక ఆంతర్యం ఏంటని మనోహర్ ప్రశ్నించారు. ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారని చెప్పారు. ఇండోసోల్ సంస్థకు రామాయపట్నం పోర్టు పరిసరాల్లో 8 వేల 348 ఎకరాల భూకేటాయింపు వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు.
ఈ కంపెనీకి సోమశిల, కనిగిరి, సంగం జలాశయాల నుంచి నీటి కేటాయింపులతో పాటు చుట్టుపక్కల ఉన్న తాగునీటి చెరువులను కూడా ఈ సంస్థకు దారాదత్తం చేసిందని విమర్శలు గుప్పించారు. భారీ పెట్టుబడులంటూ ఈ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. భూదోపిడీలో భాగమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సన్నిహితులకు చెందిన ఈ కంపెనీ కోసమే కొత్త భూకేటాయింపుల విధానం తీసుకొచ్చారని, వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందించారని గుర్తు చేశారు. ఉత్పత్తి ప్రారంభించకుండానే ఆ కంపెనీకి భూములను ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.