High Charges in Private Buses: సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ పండగ చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ఛార్జీలు బాదుతున్నారు. విజయవాడ నుంచి విశాఖకు సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్లో ఒక్కో టికెట్ ధర రూ.1200 ఉండేది. కొన్ని బస్సుల్లో రూ.1500 ఉంటుంది. సంక్రాంతి రద్దీ అవకాశంగా చేసుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ఏకంగా రూ.4 వేలు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే ధరలను ఇలా చూపిస్తున్నారంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇట్టే అర్ధం చేసుకోవచ్చని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చే ప్రయాణికలను బట్టి అప్పటికప్పుడు రేట్లు పెంచేస్తున్నారని వాపోతున్నారు.
విజయవాడ నుంచి కడపకు టికెట్ ధర 2500, తిరుపతికి 3000 వరకు డిమాండ్ పలుకుతోంది. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు సాధారణ రోజుల్లో టికెట్ 500 నుంచి 600, నాన్ ఏసీ స్లీపర్‌కు 700 ఉండేది. ఇప్పుడు నాన్ ఏసీ సీట్లకు 1500, స్లీపర్లో 2 వేలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి కాకినాడ, అమలాపురం, నెల్లూరు తదితర ప్రాంతాలకూ అధిక ఛార్జీలు బాదేస్తున్నారు.
మరోవైపు సంక్రాంతి ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వచ్చే రైళ్లు రద్దీగా మారాయి. సాధారణ రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోవడంతో, తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల కోసం ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు చర్లపల్లి నుంచి నరసాపురం, కాకినాడ, శ్రీకాకుళానికి 43 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
సొంతూళ్లకు బైక్‌లపై వెళ్తున్న కుటుంబాలు: బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో పాటు రైళ్లు ఖాళీగా లేకపోవడంతో పలువురు బైక్‌లపైనే సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్- విజయవాడ- కోల్‌కతా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు పెరిగాయి. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బైక్‌లపై పలు కుటుంబాలు వెళ్తున్నాయి. కోస్తాంధ్ర వాసులు హైదరాబాద్ నుంచి బైకులపై సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లలో బెర్తులు లేకపోవడం, బస్సు అధిక ఛార్జీలతో బైక్‌లపై సొంతూళ్లకు ప్రయాణం చేస్తున్నారు. సరిపడ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో బైకులపై వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు చెప్తున్నారు.
ఆకాశాన్ని తాకుతున్న ఫ్లైట్ ఛార్జీలు: ఫ్లైట్ ఛార్జీలు సైతం భారీగా పెరిగాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖకు సుమారు 4000 నుంచి 6000 మధ్య ఉండేది. ప్రస్తుతం సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఏకంగా 13000 నుంచి 20,000 వరకూ వసూలు చేస్తున్నారు. భారీగా పెరిగిన ఛార్జీలను చూసి ప్రయాణికులు షాకు తింటున్నారు.
ట్రావెల్స్ వాళ్లు ఏం చెప్తున్నారంటే?: అధిక రేట్లపై ట్రావెల్స్ వాళ్ల మరోరకంగా స్పందిస్తున్నారు. రిటర్న జర్నీలో సీట్లు ఫిల్ కావడం లేదని, ఖాళీగా రావాల్సి వస్తుందని అంటున్నారు. తామేమీ ఎక్కువగా వసూలు చేయట్లేదని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండగ తమకు కూడా కాస్త ఆనందాన్ని ఇచ్చే విధంగా ఛార్జీలు వస్తున్నారని కొంతమంది అభిప్రాయపడున్నారు.
ప్రయాణికులతో కళకళలాడుతోన్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్‌గేట్లు
సంక్రాంతి రద్దీపై ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు- ఆ బాధ్యత రవాణా శాఖ అధికారులదే