ముఖ్యమంత్రికి పేదలు, పెత్తందార్లు అంటూ మాట్లాడే అర్హతే లేదు: నాదెండ్ల మనోహర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 20, 2023, 10:53 PM IST
Nadendla Manohar Fires on AP CM YS Jagan: రుషికొండ మీద నిర్మాణాలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. జగనన్న కాలనీల్లో పేదవాడికి ఇంటికి సెంటు భూమి ఇచ్చి... తాను మాత్రం రుషికొండపై 9 ఎకరాల్లో భవంతి నిర్మించుకోవటం ఏమిటని నాదెండ్ల ప్రశ్నించారు. గండికోటలో ఒబెరాయ్ గ్రూప్ నిర్మించే ఏడు నక్షత్రాల హోటల్ కు 350 కోట్లు ఖర్చవుతుంటే... సీఎం ఇంటికి మాత్రం రూ. 451.67కోట్లు ఎందుకు ఖర్చవుతోందో చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. ప్రజాధనంతో ఇంతా భారీ భవంతి నిర్మించుకున్న ముఖ్యమంత్రికి పేదలు, పెత్తందార్లు అంటూ మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రపంచంలో ఏ దేశ అధినేత కూడా నివాస భవనాల కోసం ఇంతలా ప్రజాధనాన్ని వెచ్చించలేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తలా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి తన విలాసాల కోసం ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
రుషికొండపై టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామంటూ.. బ్యాంకుల నుంచి రుణం రూ. 140 కోట్లు తీసుకొచ్చారని నాదెండ్ల ఆరోపించారు. 750 ఎగ్జిక్యూటివ్ ఛైర్స్, 100 సోఫా సెట్లు కొన్నవారు.. 20 పడకలు మాత్రమే కొన్నారని వివరించారు. ఈ ప్రాంతంలో పర్యాటక రిసార్టు నిర్మిస్తే 20 పడకలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నిధులు వెచ్చించారని నాదెండ్ల పేర్కొన్నారు. టూరిజం ప్రాజెక్టు పేరుతో జగన్ బ్యాంకులను, న్యాయస్థానాల్ని, ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. టూరిజం ప్రాజెక్టు పేరిట కోర్టులు, బ్యాంకులను తప్పుదారి పట్టించిన ఈ ప్రభుత్వంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని న్యాయస్థానాలకు నాదెండ్ల విజ్ఞప్తి చేశారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదన్నారు. పవన్ కల్యాణ్ వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారని, జనసేన నాయకులు అక్కడికి వెళ్తే పోలీసు కేసులు పెట్టారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.