Munneru Floods Effect in Nandigama: మునేరు ఉద్ధృతి.. కొట్టుకుపోయిన రోడ్లు.. జనాల అవస్థలు - ఆంధ్రప్రదేశ్ వరదల సమాచారం
🎬 Watch Now: Feature Video
Kanchala Road Damage Due to Munneru Flood : మునేరు ఉద్ధృతికి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. వరద ధాటికి రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు ధ్వంసం కావటంతో కంచల గ్రామానికి చెందినవారు చందర్లపాడు మండలం తుర్లపాడు, ముప్పాళ్ల మీదుగా నందిగామకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి వేరువేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. చుట్టూ తిరిగి రావాల్సి ఉండటంతో గ్రామస్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వెంటనే దెబ్బతిన్న రోడ్డును పునర్నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ప్రధానంగా కంచల గ్రామంలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఇటుకల విక్రయం బాగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మునేరుకు వరద రావడంతో ఈసారి ఇటుక బట్టీలకు నష్టం వాటిల్లిందని యజమానులు వాపోతున్నారు. ఒక్కొక్కరు ఐదారు లక్షలపైన నష్టపోయామని తెలిపారు. నందిగామ మండలంలోని పలు గ్రామాల పరిధిలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని.. కూరగాయల తోటలు నాశనమయ్యాయని రైతులు వాపోయారు.