Municipal workers Chalo Vijayawada: సమాన పనికి సమాన వేతనమిచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం..: పారిశుద్ధ్య కార్మికులు - కార్మికులు పెద్ద ఎత్తున నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 10:19 PM IST
Municipal workers Chalo Vijayawada: సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కేంద్రాల్లో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాట తప్పను, మడమ తిప్పనన్న జగన్, తమను వంచించారని శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
ఎన్నికల ముందు తమను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్, తాను అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మున్సిపల్ కార్మికులు( Municipal workers) మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కార్మికులు, ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతుంటే తమకు ఇచ్చే 13వేల రూపాయల జీతంతో ఎలా కుటుంబాలను పోషించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో ఇళ్లు అద్దెలు, పిల్లల చదువులు ఎలా సాగుతాయన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సంక్షేమ పథకాల్లోనూ కోత పెట్టారని ఆక్షేపించారు. కార్మికులందరినీ ఆప్కాస్‌లో ఉద్యోగులుగా నమోదు చేసి.. 60 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకుండా విధుల నుంచి తొలగిస్తున్నారని కార్మిక నేతలు మండిపడ్డారు. సిబ్బంది సంఖ్య పెంచడం లేదని.. పనిచేస్తున్న వారిపైనే అదనపు భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలవెన్స్ చెల్లించడం లేదన్నారు. క్లాప్ డ్రైవర్లనూ శ్రమదోపిడీ(Exploitation of labor) చేస్తున్నారని విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికులు స్థానిక పురపాలక కార్యాలయం నుంచి భారీ ర్యాలీ( huge rally) నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడికి...మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్(Town Planning and Sanitation Workers) యత్నించారు. జనసేన ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపింది. నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛభారత్ కార్మికులు నిరసనకు దిగారు. సీఐటీయూ వీరికి మద్దతు తెలిపింది. ఏడాదిగా జీతాలు ఇవ్వకుండా తాము ఎలా బతకాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు . జీతాలు పెంచాలని ఎంపీడీఓ కు వినతి పత్రం ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం అన్యాయమని మండిపడ్డారు.