ఒక్కసారి జగన్‌ను కలిసే అవకాశం కల్పించండి: డొక్కా మాణిక్య వరప్రసాద్
🎬 Watch Now: Feature Video
MLC Dokka Varaprasad Serious Comments on Jagan: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేసిన సీఎం జగన్ అంటూ వైసీపీ నేతలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార సభలోనే ఎస్సీ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఆవేదన వెలిబుచ్చారు. ఒకసారి సీఎం జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ పెద్దలను వేడుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న డొక్కా వైసీపీలో జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదన్నారు. గతంలో తాడికొండలో పోటీ చేయమని అధిష్టానం నుంచే పిలుపు వచ్చిందని, తాడికొండ అభ్యర్థి నువ్వే అని సీఎం కూడా చెప్పారని పేర్కొన్నారు.
తనకు సంబంధం లేకుండానే సమన్వయకర్తగా నియమించారని కానీ సర్వేలు బాగోలేదని పక్కన పెట్టేశారని డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు సుచరితను ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించారన్నారు. రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆశ లేదన్న డొక్కా, వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు గుంటూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎస్సీ నేత అయిన డొక్కాను కలిసేందుకు సైతం సీఎం జగన్ ఆసక్తి చూపడం లేదని, ఇదేనా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న సామాజిక సాధికారత అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.