'గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఎవరూ ప్రశ్నించొద్దు'.. కేతిరెడ్డి అనుచరుడి బెదిరింపులు.. ఆడియో వైరల్
🎬 Watch Now: Feature Video
MLA Kethireddy good morning Dharmavaram: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి రాకుంటే ఇబ్బందులు పడతారంటూ వైసీపీ నాయకుడు మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి వార్డు ప్రజలు, వాలంటీర్లు, అధికారులు హాజరుకావాలని.. ఎవరైనా వార్డులో సమస్యలను ప్రశ్నించే వారిని ముందుగా గుర్తించాలని ఆడియోలో పేర్కొన్నాడు. వాలంటీర్లను, వార్డు సచివాలయ ఉద్యోగులను బెదిరిస్తూ 23 వార్డు కౌన్సిలర్ షకీలా భర్త ఎస్పీ బాషా హెచ్చరిస్తున్న ఆడియో వెలుగు చూసింది. బాషా మాట్లాడిన ఈ ఆడియో తాజాగా వైరల్ అయ్యింది. గురువారం పట్టణంలోని 23వ వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు వైసీపీ నాయకుడు ఎస్పీ బాషా పంపిన ఆడియో కలకలం రేపింది. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ఆదరణ తగ్గుతుండటంతో తప్పనిసరిగా రావాలని వైసీపీ నాయకుడు ఎస్పీ బాషా బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి ద్వారా లబ్ధిపొందిన వారు గుడ్‌మార్నింగ్ కార్యక్రమానికి వచ్చినప్పుడు బొకేలు, స్వీట్లు తీసుకువచ్చేలా ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు ఆడియోలో సూచించారు. ప్రతి వార్డ్‌లో తనకు కేటాయించిన 50 మందితోపాటుగా... గృహసారథులను తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఎవ్వరూ ప్రశ్నించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోమని ఆడియోలో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే ముందు ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే వారి తోకలు కత్తిరించే చర్యలు ఉంటాయని.. అలాంటి వారికి ముందే సమాచారం ఇవ్వండని పేర్కొన్నాడు. ఎమ్మెల్యే మన కోసం ఎన్నో మంచి పనులు చేశారనీ.. ఆయన నిర్వహించే గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆడియోలో అధికారులు, వాలంటీర్లను ఎస్పీ బాషా హెచ్చరించిన ఆడియో వైరల్‌గా మారింది.