MLA Abbayya chowdary Vs YSRCP Leader Alapati Narasimha Murthy: "వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకపోతే.. పార్టీకి పని చేసేది లేదు"
🎬 Watch Now: Feature Video
YSRCP Leader Alapati Narasimha Murthy Comments on MLA Abbayya Chowdary : దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అవినీతితో పార్టీని భ్రష్టు పట్టించారని.. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి ఆరోపించారు. అబ్బయ్య చౌదరి నియంతృత్వ పోకడల కారణంగా పార్టీలో సీనియర్ నాయకులు ఉండలేని పరిస్థితి నెలకొందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులను, కార్యకర్తలను కాదని, కేవలం తన కోటరీకి చెందిన వ్యక్తులనే అందలం ఎక్కిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండాల్సింది పోయి.. విదేశాల్లో ఉంటూ ఇక్కడ మరొకరితో పెత్తనం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి 17 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోనున్నారని ఆలపాటి నరసింహమూర్తి జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే.. కోడి పందేలు, జూద శిబిరాలు, మట్టి, ఇసుక మాఫియాలను పెంచి పోషిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అవినీతిపై పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే తప్ప.. ఆ పార్టీకి పని చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.