Pinipe Viswarup: 'ఛలో అమలాపురం' పిలుపు ఇమ్మంటారా.. డీఎస్పీపై మంత్రి ఆగ్రహం - పినిపే విశ్వరూప్ లేటెస్ట్ వీడియో
🎬 Watch Now: Feature Video
Minister Pinipe Viswarup fired on DSP: మీరు పట్టుకున్న ద్విచక్ర వాహనాలను వదిలేస్తారా లేక 'ఛలో అమలాపురం' పిలుపు ఇమ్మంటారా? అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో సైలెన్సర్లు తీసేసి నడుపుతున్న నాలుగు వాహనాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో మంత్రి విశ్వరూప్ కుమారుడు తన అనుచరులతో డీఎస్పీ వద్దకు వచ్చి స్వాధీనం చేసుకున్న వాహనాలు విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయి తన తండ్రి, మంత్రి విశ్వరూప్‌ను వెంటపెట్టుకొని వచ్చాడు. డీఎస్పీ వద్దకు వచ్చిన మంత్రి.. వాహనాలు వదిలేస్తారా? లేదా? 'ఛలో అమలాపురం' పిలుపు ఇమ్మంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనల మేరకు తాము ముందుకు వెళ్తున్నామని డీఎస్పీ మంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఎంత సిన్సియర్‌గా పని చేస్తారో మాకు తెలుసులే కానీ ముందు ఆ బండ్లు పంపించండి అని అంటూ డీఎస్పీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ యువకుల మోటార్‌సైకిళ్లను తీసుకొని వెళ్లిపోయారు.