Zoological Parks: జంతు ప్రదర్శన శాలల అభివృద్ధికి చర్యలు: మంత్రి పెద్దిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Zoological Parks in AP: రాష్ట్రంలోని జంతుప్రదర్శనశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన జూ అథారిటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో తిరుపతి, విశాఖ జూపార్క్ల అభివృద్ధి కార్యాచరణపై మంత్రి మాట్లాడారు. దేశంలోని జూపార్క్ అథారిటీలతో జంతువుల మార్పిడి గురించి సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు.
తిరుపతి జూపార్క్‌లో ఎలక్ట్రికల్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నామని, దీనిద్వారా 30 శాతం జూపార్క్‌కు ఆదాయం లభిస్తుందని మంత్రి వెల్లడించారు. విశాఖ జూపార్క్లోనూ ఈ విధానంను ప్రవేశపెడతామని తెలిపారు. అలాగే జూపార్క్‌ల్లో జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్‌పై హేతుబద్దత కోసం సమగ్ర నివేదికను సిద్దం చేయాలని పీసీసీఎఫ్‌ను మంత్రి ఆదేశించారు. అస్సాం ప్రభుత్వంతో సంప్రదించి ఖడ్గమృగాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జునాఘడ్, చెన్నై, వరంగల్ జూపార్క్ అథారిటీలతో కూడా సంప్రదింపులు జరపాలని, వారి వద్ద ఉన్న జంతువులకు బదులుగా మన రాష్ట్రంలోని జూపార్క్‌ల్లో ఉన్న జంతువులను మార్చుకోవాలని మంత్రి సూచించారు. పర్యావరణహిత సామాగ్రితో తయారు చేసిన జంతు నమూనాలను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు.