Minister Jogi Ramesh Personal Photographer Missing Case మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ అదృశ్యం కేసులో మరో మలుపు..వీడియో వైరల్ - Photographer Adinarayana Missing Case news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 5:20 PM IST
Minister Jogi Ramesh Personal Photographer Missing Case Updates: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. రెండు రోజులక్రితం తాను చనిపోతున్నట్లు ఓ సూసైడ్ నోట్ రాసిన ఆదినారాయణ.. అందరిని నమ్మించి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఆదినారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్ పెడన, కోడూరు పోలీసులు.. నాలుగు రోజులైనా మృతదేహం దొరక్కపోవడంతో అనుమానం వచ్చి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా అసలు విషం వెలుగులోకి వచ్చింది.
Photographer Adinarayana CCTV Video: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ''ఆదినారాయణ ఆచూకీ కోసం కృష్ణా జిల్లా చిన్నాపురం వద్దనున్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. అతను ద్విచక్ర వాహనానికి ఓ బ్యాగ్ తగిలించుకుని నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఉల్లిపాలెం-భవానిపురం వారధి వద్ద బైక్ ఉంచి.. ఆటోలో కోడూరు గంగమ్మ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఉల్లిపాలెం బ్రిడ్జి దగ్గరే అతను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించాము. అక్కడి నుండి ఆటో ఎక్కి కోడూరు గంగానమ్మ సెంటర్ దగ్గరకు వచ్చినట్లు గుర్తించాము. అతను నైట్ టీ షర్ట్, షార్ట్, బ్యాగు, క్యాప్‌తో పాటు కనపడకుండా ఉండడానికి ఓ మాస్క్ తగిలించుకుని నడుచుకుంటూ.. ఆటో కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించాము. ఆదినారాయణ చనిపోలేదు. చనిపోతున్నట్లు అందర్నీ నమ్మించి.. పరారయ్యాడని దర్యాప్తులో తేలింది.'' అని అధికారులు వెల్లడించారు. అనంతరం సీసీ కెమెరా వీడియోను విడుదలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. ఆదినారాయణ అప్పుల బారి నుండి తప్పించుకోవడానికి ఈ విధంగా ప్లాన్ రచించాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.