'ఆలూరు టికెట్ గుమ్మనూరుకే కేటాయించాలి - అభ్యర్థిని మార్చితే ఓటమి ఖాయం' - ఆలూరు అసెంబ్లీ టికెట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 7:17 PM IST
Minister Gummanuru Jayaram Followers Meeting: అధికార వైఎస్సార్సీపీలో మార్పులు చేర్పుల కారణంగా అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరులో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలూరు టికెట్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
కొత్తవారికి టికెట్ కేటాయిస్తే పోటీ చేసే అభ్యర్థి ఓడిపోవటం ఖాయమన్నారు. మూడు పర్యాయాలు ఆలూరు నుంచి పోటీ చేసిన గుమ్మానురు జయరాం రెండుసార్లు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి మంత్రిగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. బీసీ నేతగా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి జయరామ్ కృషి చేశారన్నారు. ఈసారి జయరాంకు టికెట్ ఇవ్వకపోతే కలిసికట్టుగా భవిష్యత్ కార్యాచరణపై సమాలోచన చేస్తామన్నారు. కాగా గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరులో ఈసారి వేరేవాళ్లకు టికెట్ ఇస్తున్నట్లు స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.