Lokesh Attended 2nd Day CID Enquiry: రెండో రోజూ సీఐడీ విచారణకు లోకేశ్.. 5నిమిషాల ముందే హాజరు.. - మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 1:20 PM IST
Lokesh Attended 2nd Day CID Enquiry: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్.. రెండో రోజూ సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఐడీ చెప్పిన సమయానికి 5నిమిషాలు ముందే ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. 10వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే లోకేశ్‌ను విచారించాలని.. న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నిన్న సీఐడీ అడిగిన దాదాపు 50ప్రశ్నలకు లోకేశ్ సూటిగా సమాధానం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రశ్నలు హెరిటేజ్ గురించే సీఐడీ ఆడిగిందని లోకేశ్ నిన్న విచారణ అనంతరం తెలిపారు. మిగిలిన ప్రశ్నలకూ నిన్ననే సమాధానం చెప్తానన్నా సీఐడీ అంగీకరించలేదన్నారు.
న్యాయవాదులతో సంప్రదింపుల కోసం దిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆలస్యమైనా సరే మంగళవారమే మిగతా ప్రశ్నలు అడగాలని లోకేశ్ కోరినట్లు తెలిపారు. సీఐడీ అధికారులు మాత్రం న్యాయస్థానం ఆదేశాల మేరకు 5 గంటలకే విచారణ ముగిస్తున్నామన్నారు. తన అంగీకారంతోనే 5 గంటల తర్వాత విచారణ కొనసాగించామని కోర్టుకు తెలియజేయవచ్చని లోకేశ్ సీఐడీని కోరారు. ప్రశ్నలు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నందున బుధవారం విచారిస్తామని దర్యాప్తు అధికారి చెప్పటంతో లోకేశ్ అందుకు అంగీకరించారు. నిన్న విచారణ ముగిశాక మళ్లీ 41A నోటీసు జారీ చేసి సీఐడీ నేడు కూడా విచారణకు పిలిచింది.