JC Fires on MLA Peddareddy: 'ఇకపై ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. నేనే పరిష్కరిస్తా' - పైపులైను మరమ్మతులు అడ్డుకున్న అధికారులు
🎬 Watch Now: Feature Video
JC Prabhakar Reddy Fires On MLA Kethireddy Peddareddy : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించే వారికి అడ్డు పడుతున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో మురుగునీటి పైపులైను పగిలిపోయి వీధుల్లో మురుగు నీరు పారుతోంది. పదకొండు నెలలుగా ప్రజలు పురపాలక అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్నా పరిష్కారం చూపలేదు. ప్రజల ఇబ్బంది చూసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసమ్మతి వర్గ నేత రమేష్ రెడ్డి నెల రోజుల క్రితం జేసీబీ తీసుకెళ్లి పైపులైను రిపేరు చేసే ప్రయత్నం చేశారు. రమేష్ రెడ్డిని పోలీసులు, మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రజలంతా మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరారు.
జేసీ తన సొంత ఖర్చుతో యంత్రాలు, కూలీలను తీసుకెళ్లి దగ్గరుండి మురుగు నీటి పైపులైను మరమ్మతులు చేయించారు. ఎమ్మెల్యే తన అధికారంతో అభివృద్ధి పనులు జరగనివ్వడం లేదని జేసీ అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో ఇకపై ఏ సమస్య వచ్చినా టెండర్లు, ఎమ్మెల్యే అడ్డుకోవడం ఉండవని, తానే సొంత ఖర్చుతో సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తుంటే పోలీసులు, మున్సిపల్ ఇంజనీరు అడ్డుపడటం ఏంటని,.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.