Jagananna Colonies చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు.. ముంపు ప్రాంతాల్లో ఇళ్లపై ఆందోళన
🎬 Watch Now: Feature Video
Jagananna Colonies Look Like Ponds In Pydivada Agraharam : వర్షాలకు జగనన్న కాలనీలు.. చెరువులను తలపిస్తున్నాయి. విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 2022 ఏప్రిల్ 28 సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన లేఔట్ ఇప్పుడు తటాకాన్ని తలపిస్తోంది. వర్షపు నీటి ప్రవాహానికి జగనన్న కాలనీల్లోని రోడ్లు కోతకు గురయ్యాయి.ప్రభుత్వం చెప్పిన విధంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు కాబట్టి బతికిపోయామని, లేదంటే ముంపు బారిన పడాల్సి వచ్చేదని లబ్దిదారులు అంటున్నారు.
కొండవాగు నుంచి వచ్చే వాన నీరు వెళ్లేందుకు.. సరైన మార్గం చూపకపోడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. పైడివాడ అగ్రహారం గ్రామంలో 4 చెరువులున్నాయి. వర్షం పడితే ఈ నాలుగు చెరువుల్లోని నీరంతా జగనన్న కాలనీ లేఔట్ కోసం సేకరించిన భూమిలోకి చేరుతోంది. ఈ వర్షపు నీరు వెళ్లడానికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోడం.. ఇప్పుడు లబ్దిదారులను నీటిపాలు జేసేలాఉంది. అప్పట్లో విపక్షాలు ఈ మేరకు అభ్యంతరం తెలిపినా రెవెన్యూ అధికారులు పెడచెవిన పెట్టి.. తూతూమంత్రంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. దానికి ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ప్రజాధనంతో వేసిన రోడ్లు వాన నీటి ప్రవాహానికి కోతకు గురయ్యాయి. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల హద్దు రాళ్లు కూడా కొన్ని కొట్టుకుపోయాయి.