IT employees car rally: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు.. అతిక్రమిస్తే కేసులే : విజయవాడ సీపీ - ఏపీ ఐటీ ఉద్యోగులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 10:17 PM IST
IT employees car rally: నారా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు తలపెట్టిన కార్ల ర్యాలీకి అనుమతి లేదని విజయవాడ (Vijayawada ) సీపీ కాంతి రాణా తెలిపారు. కార్లతో సంఘీభావ యాత్రకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి నిరసనలు, ర్యాలీలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని కాంతి రాణా తెలిపారు. ర్యాలీ గురించి సామాజిక మాధ్యమాల ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాదు నుంచి ఐటీ ఉద్యోగులు తలపెట్టిన చలో రాజమండ్రి కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి పోలీసులు సన్నాహాలు చేశారు.
మూడు చెక్ పోస్టులు.. వందలాది పోలీసులు : ఇప్పటికే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద నుంచి అనుమంచిపల్లి వరకు మూడు పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడికి వెళ్తున్నారని పరిశీలించి రాజమండ్రి వెళ్లేవారిని మాత్రం అనుమంచిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఖాళీ స్థలంలో ఆపేయడానికి ఏర్పాట్లు చేశారు. వందలాది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. కార్ల ద్వారా సంఘీభావ యాత్రకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కఠిన చర్యలు: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏవిధమైన వాహన ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదని, ర్యాలీ నిర్వహిస్తే 143, 290,188, రెడ్ విత్ 149, సెక్షన్ 32 పోలీసు యాక్ట్... తదితర సెక్షన్ 3 క్రింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. ఈ నేపథ్యంలో గరికపాడు చెక్ పోస్టు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీని ప్రారంభించి... గరికిపాడు చెక్ పోస్టు మీదుగా రాజమండ్రి వెళ్లేందుకు ఐటీ ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు వారిని ఆపేందుకు పోలీసులు సంసిద్ధమవుతున్నారు.