Huge Rally in Anantapuram Against CBN Arrest: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భారీ ర్యాలీ.. బాబు కోసం మేము సైతం అంటూ నినాదాలు - Anantapur News in Telugu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 10:18 AM IST
Huge rally in Anantapuram Against CBN Arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ అనంతపురంలో తెలుగుదేశం, జనసేన, సీపీఐ నేతలు కదం తొక్కారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును (Naidu Arrest in AP Skill Development Case) వ్యతిరేకిస్తూ అనంతపురంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మాజీమంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. అధినేతను విడుదల చేసేంత వరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్షలు మానుకోని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నియంతృత్వ పాలన చేసే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధం ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ముఖ్యమంత్రి జగన్ ఆనందిస్తున్నారని జనసేన నాయకురాలు శ్రీలత మండిపడ్డారు.