Huge Devotees in Vijayawada Indrakiladri: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు.. దర్శనం ఆలస్యంపై భక్తుల తీవ్ర అసహనం - Vijayawada Indrakiladri
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 9:34 PM IST
|Updated : Oct 16, 2023, 7:10 AM IST
Huge Devotees in Vijayawada Indrakiladri విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ దంపతులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేద పండితులు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు గవర్నర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. నవరాత్రుల తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి మొదటి రోజు భక్తులు పోటెత్తారు. క్యూలైన్ల దగ్గర తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో ఉచిత దర్శనం భక్తులు 500 రూపాయల క్యూ లైన్‌లో ప్రవేశించడంపై టికెట్లు కొన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. టికెట్ కొనుగోలు చేసి కూడా గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ ఛైర్మన్ రాంబాబును భక్తులు కోరారు.
మంత్రి ఆగ్రహం: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల నిర్వహణ తీరుపై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటే... సిఫార్సులతో వచ్చేవాళ్లు మాత్రం దర్జాగా దర్శనాలు చేసుకుని వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం నుంచి ఆరంభమయ్యాయి. తొలిరోజే భక్తులు భారీగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తులను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. టికెట్టు లేని వారిని 500 క్యూలైన్‌లో ఎలా పంపారంటూ... పోలీస్ సిబ్బందిని మంత్రి ప్రశ్నించారు. ఎవరి బాధ్యత వారు నిబద్ధతతో నిర్వర్తిస్తే పొరపాట్లు జరగవన్నారు.