School: దుండగుల అరాచకం.. హైస్కూల్లో సామాగ్రి ధ్వంసం - నాడు నేడు హైస్కూల్ సామాగ్రి ధ్వంసం వీడియో
🎬 Watch Now: Feature Video
High School Equipment Destruction: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలానికి చెందిన మామిడిపల్లి గ్రామంలోని హైస్కూల్లోని సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం స్కూల్‌కి ఉపాధ్యాయులు వచ్చి చూసేసరికి సామగ్రి అంతా చిందరవందరగా పడి ఉంది. మంగళవారం రాత్రి సమయంలో ఆకతాయిలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఉపాధ్యాయులతో పాటు స్థానికులు భావిస్తున్నారు. గతంలో కూడా ఇదేవిధంగా విధ్వంసాలకు పాల్పడినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్లోని ఓ గదిలోని బెంచీలను, అక్కడ ఉన్న పుస్తకాలను, ఫ్యాన్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులు మరుగుదొడ్ల పైపులు కూడా విరిచేశారు. పాఠశాల తరగతి గదిలో ఉన్న ఏసీని కూడా పాడు చేశారు. అంతటితో ఆగకుండా మరో తరగతి గదిలోకి ప్రవేశించి మోటార్ పైపు లైన్లను కూడా విరిచేశారు. దీంతో విద్యార్థుల కోసం మిడ్ డే మీల్స్ ప్రిపేర్ చేసే సిబ్బందికి నీటి సదుపాయం లేకుండాపోయింది. వారు బోరింగ్ దగ్గరకు వెళ్లి బకెట్లల్లో నీళ్లు నింపుకుని మోసుకుని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా విద్యార్థులకు సమయానికి మిడ్ డే మీల్స్ అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు.
ఆ పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం కింద పనులు జరిగి కేవలం ఏడాదే అయింది. నాడు-నేడులో భాగంగా జరిగిన తరగతి గదులు, ఫ్యాన్లు, విద్యార్థులు కూర్చొని చదువుకునేందుకు ఏర్పాటు చేసిన టేబుల్స్‌ను ధ్వంసం చేయటంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనలో సుమారు 3 లక్షల రూపాయల విలువ చేసే పాఠశాల సామగ్రి ధ్వంసం అయింది. పాఠశాల ఇంఛార్జి కామేశ్వరరావు.. గ్రామ పెద్దలకు, గ్రామ సర్పంచ్ శశికళకు, డీఈఓ అధికారులకు, గ్రామీణ రూరల్ ఎస్సై ప్రయోగమూర్తికి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్సై ప్రయోగమూర్తి హైస్కూల్‌కు చేరుకుని క్లాస్‌రూమ్‌ను పరిశీలించారు.