Heavy Rains: రానున్న 24గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
Heavy Rains in Coastal Andhra: రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల విస్తారంగా వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. నైరుతీ బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కోస్తాంధ్రపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించింది. ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్రలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.