Heavy Rain In Kadapa City:భారీ వర్షం.. తడిసి ముద్దైన కడప నగరం.. ఇబ్బందుల్లో ప్రజలు..
🎬 Watch Now: Feature Video
Heavy Rain In Kadapa City: భారీ వర్షానికి కడప నగరం అతలాకుతలమైంది. శనివారం రాత్రి నుంచి అదివారం ఉదయం వరకు ఏకాధాటిగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది. శనివారం భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. వేసవి తలపించేలా ఎండ స్థాయి ఉండటంతో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. రాత్రి కురిసిన వర్షానికి నగరం మొత్తం జలమయమైంది. రోడ్లపై మోకాళ్ల లోతు వర్షపు నీరు ప్రవహించింది. వరద ప్రవాహానికి మురుగు కాలువలు పొంగిపొర్లాయి.
బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, వై జంక్షన్, భరత్ నగర్, గంజికుంట కాలనీ, మృత్యుంజయ కుంట, కోర్టు రోడ్డు, ప్రకాశ్ నగర్, నిరంజన్ నగర్, లోహియా నగర్, రామరాజు పల్లి, అల్లూరి సీతారామరాజు నగర్ తదితర ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్సర రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ గ్యారేజ్‌లోకి, బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో కార్మికులు.. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా మురుగు కాలువల కోసం తీసిన గుంతల్లోకి నీరు చేరడంతో పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం ఒక్క రాత్రి కురిసిన వర్షానికి నగరం ఈ విధంగా మారడంతో ఇక ఏకధాటిగా రెండు మూడు రోజులు వర్షం కురిస్తే నగరం పరిస్థితి ఏమిటని ప్రజలు వాపోతున్నారు. నగరంలోని మురుగు కాలువల్లో పూడికలు తీస్తే ఈ సమస్య ఉండదని అంటున్నారు.