2 వేల కేజీల ద్రాక్షతో ఆలయ అలంకరణ.. ఆశ్రమాలకు దానంగా పండ్లు!
🎬 Watch Now: Feature Video
దేవాలయం అంతా పూలతో, రంగు రంగుల లైట్లతో అలంకరించడం చూసుంటాం కానీ తినే పండ్లతో చూసుండం కదా. అలాంటిదే పుణెలోని ప్రసిద్ధ దగ్డుశేఠ్ వినాయక ఆలయంలో 2000 కిలోల ద్రాక్షపండ్లతో దేవాలయాన్ని అలంకరించారు. పుణెకు చెందిన సుప్రసిద్ధ శ్రీమంత్ దగ్డుశేఠ్ హల్వాయి పబ్లిక్ గణపతి ట్రస్ట్.. సంకష్టి చతుర్థి సందర్భంగా ఆలయంలో పండ్లతో అలకరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని గభార, సభా ప్రాంగణాన్ని నలుపు, పచ్చ ద్రాక్షపండ్లతో అలంకరించారు. 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను తెచ్చి దేవాలయాన్ని అలంకరించి ఈ పండుగను జరిపారు ఆలయ నిర్వాహకులు. ఈ ద్రాక్షలు రసాయనాలు వాడకుండా తయారు చేసిన ఆర్గానిక్ పండ్లు అని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు ఉపాధ్యక్షుడు సునీల్ రాస్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విలాస్ శిందేతో పాటు స్థానిక రైతులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ పండ్లను భక్తులకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, ఆస్పత్రులకు పంచుతామని తెలిపారు.
ద్రాక్ష సీజన్‌లో వినాయక దేవాలయంలో ఈ తరహా ఏర్పాట్లు చేయడం వరుసగా ఇది రెండో ఏడాది. ద్రాక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఆలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. 'వాతావరణ మార్పుల వల్ల పంట దెబ్బతినడం, మార్కెట్ ధరలు పడిపోవడం వల్ల ద్రాక్ష సాగు అనేది సంక్షోభంలో పడింది. ఈ ఏడాది రైతులకు కాస్త ఊరట లభించింది. అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడే ధైర్యం రైతులకు ఉంది. రైతులు కష్టాలు వినాయకుడికి విన్నవించుకునేందుకు ద్రాక్షలను సమర్పించారు' అని ట్రస్టు ఉపాధ్యక్షుడు సునీల్ రసానే తెలిపారు.