'ఆదాయం కంటే అప్పులే ఎక్కువ - మద్యం ఆదాయంతో ఆ నాలుగు పథకాలకు నిధులు' - బుగ్గన రాజేంద్రనాథ్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 5:35 PM IST
Finance Minister Buggana Rajendhranadh: కోవిడ్ వల్ల ఆదాయం కంటే ఎక్కువ అప్పులు అయ్యాయని, దీన్ని తాము కూడా అంగీకరించామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై టీడీపీ నేతలు వేర్వేరు వ్యాఖ్యలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. రూ.13 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటే యనమల 10 లక్షల రూపాయల అప్పు అంటున్నారని, అసలు అప్పు ఎంతో సరిగ్గా చెప్పగలరా అని బుగ్గన ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ ఆదాయం వచ్చిందని బగ్గన చెప్పారు. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖే అప్పులు, ఆదాయం గురించి పార్లమెంటులో చెప్పిందని బుగ్గన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు 12 శాతం మేర పెరిగాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇంటింటికీ వెళ్లి అప్పు చేయవు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మాత్రమే అప్పులు తీసుకుంటాయని, అది అంతా బహిరంగంగానే జరిగిందని, వాటి వివరాలు ఉంటాయని మంత్రి తెలిపారు. మద్యం ఆదాయంలో అదనంగా వచ్చే పన్నును మహిళలు, రైతులు సహా నాలుగు పథకాలకు వినియోగించేలా చట్టం చేశామన్నారు. సీపీఎస్ గురించి అలోచించి భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా జీపీఎస్ అమలు చేశామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.