వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో గందరగోళం.. గేట్లకు తాళం వేసిన అధికారులు
🎬 Watch Now: Feature Video
YSR Asara Program: బాపట్ల జిల్లాలో మంత్రి మేరుగు నాగార్జున హాజరైన వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. భట్టిప్రోలు మార్కెట్ యార్డు ప్రాంగణంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళల్ని ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలైనా మంత్రి జాడలేదు. భోజన ఏర్పాట్లు చేయలేదు. కనీసం మంచినీరు కూడా అందించలేదు. దీంతో మహిళలు విసిగిపోయి ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అధికారులు గేట్లకు తాళాలు వేసి వారిని అడ్డుకున్నారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా సమావేశంలో ఎలా ఉండాలని మహిళలు ప్రశ్నించారు. దీంతో హడావుడిగా మంచినీరు అందించారు. అయినా కొందరు మహిళలు గేట్లు తోసుకుని వెళ్లిపోయారు. తీరికగా సాయంత్రం 4 గంటలకు మంత్రి నాగార్జున సభకు హాజరుకావడంపై పలువురు మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి వచ్చే సమయం ప్రకారం మహిళల్ని సభకు పిలిపించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని.. అధికారులు ఆర్భాటం కోసం ముందుగా పిలిపించి గంటల తరబడి వేచి ఉండేలా చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.