మరోసారి తెరపైకి అసమ్మతి రాగం - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా కౌన్సిలర్ల సమావేశం - ప్రొద్దుటూరులో వైసీపీ నేతల గ్రూపు రాజకీయాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 10:51 AM IST
Differences Between YCP Leaders in Proddatur: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీలోని అసమ్మతి రాగం మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు, నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 21 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, ఇద్దరు మాజీ ఎక్స్ అఫిషియో సభ్యులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ చిప్పగిరి ప్రసాద్‌తో పాటు మరికొంత మంది నేతలు భేటీలో పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెరవెనుక ఉండి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. కాగా గత నాలుగేళ్ల నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. ఇద్దరూ కలిసి ఏనాడూ వైసీపీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే రాచమల్లుపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీ నేతల్లోని అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పావులు కదుపు తున్నట్లు సమాచారం. అసమ్మతి కౌన్సిలర్లంతా భేటీ అయ్యారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు, ఈరోజు మున్సిపల్ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశానికి కౌన్సిలర్లందరూ హాజరు కావాలని అధికారులు సమాచారం పంపుతున్నారు. దీంతో పదిహేను రోజులు కాకముందే మరోసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.