BLO Appointments: బీఎల్ఓలుగా సచివాలయ సంక్షేమ కార్యదర్శులు.. 'వైసీపీ ప్రభుత్వం మరో ఎత్తుగడ' - voters
🎬 Watch Now: Feature Video
Booth Level Officers Appointment: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలు తప్పుల తడకగా మారాయి. దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యాయ. చనిపోయిన, పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వారి ఓట్లను కూడా తొలగించకపోవడంతో ఒక్కో ఇంట్లో వందల కొద్దీ ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందగా.. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను దిల్లీకి పిలిపించడం విదితమే. ఇదిలా ఉండగా.. తాజాగా.. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)గా సచివాలయ సంక్షేమ కార్యదర్శులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు బీఎల్వోలుగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల స్థానంలో అత్యధిక చోట్ల గ్రామ, వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులను నియమించడం వెనక గూడు పుఠాణి దాగి ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. సంక్షేమ కార్యదర్శులను బీఎల్వోలుగా నియమించడం ద్వారా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయాలన్నది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నాయి. బీఎల్వో బాధ్యతల నుంచి సంక్షేమ కార్యదర్శులను తప్పించాలని సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాసినా కలెక్టర్లు స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నాయి. బీఎల్వోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని భారం మరింత పెరిగిందని పలువురు సంక్షేమ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను జాబితాల్లో నుంచి తొలగింపులో బూత్ స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు.