CPM Press meet at Vijayawada : 'ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ విఫలం... నవంబర్ 7న విజయవాడలో ప్రజా రక్షణ భేరి' - విజయవాడ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 7:10 PM IST
CPM Press meet at Vijayawada : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. నవంబర్ 7న లక్షలాది మంది ప్రజలతో విజయవాడలో ప్రజా రక్షణ భేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్రలోని అన్ని జిల్లాల్లో జాతాలు నిర్వహించి.. ప్రజా సమస్యలు గుర్తిస్తామని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడిందని శ్రీనివాసరావు ఆరోపించారు. సీఎం జగన్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో రహస్య సమావేశం నిర్వహించి.. ఏమి చర్చించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా మోసం చేసిన బీజేపీకి మద్దతు ప్రకటించడమంటే.. ప్రజలను మోసం చేయడమేనని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ గఫూర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను ఎన్నికల ఎజెండాగా మార్చడానికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జాతాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని చెప్పిన మాట ఏమయ్యిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసిందని విమర్శించారు.