Couple suicide: కమీషన్‌కు ఆశపడ్డారు.. ఒత్తిడితో దంపతులు సూసైడ్ - Crime news
🎬 Watch Now: Feature Video
Husband and wife suicide: విశాఖ నగరంలోని కొమ్మాది స్థానిక శివశక్తి కాలనీలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఎంవీకే ప్రసాద్ (54), రాజరాజేశ్వరి (50) భార్యాభర్తలు శివశక్తి నగర్లో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు.. కృష్ణ ప్రసాద్ స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీలో వాటర్ ప్యూరిఫై కాంట్రాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు స్మార్ట్ విలేజ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి కేంద్రంగా ఉన్న సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్నారు. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది యువకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ముందుగా శిక్షణ, ఆపై నియామకాలు ఉంటాయని ప్రచారం చేశారు.ఇదే విషయంపై రణస్థలం పోలీస్ స్టేషన్ లో కృష్ణప్రసాద్‌పై బైండోవర్ కేసు కూడా నమోదయింది.
విశాఖ ప్రాంతానికి ప్రతినిధులుగా ఉన్న ఎంవీకే ప్రసాద్, రాజరాజేశ్వరి దంపతులను నమ్మిన యువకులు ఒక్కొక్కరు రూ 20 వేల నుంచి రూ 25 వేల వరకు ఆ సంస్థకు డిపాజిట్ల కింద ముట్టజెప్పారు. రోజులు గడుస్తున్నా సదరు సంస్థ వారికి ఉద్యోగాలు ఇవ్వకపోగా.. కట్టిన డిపాజిట్లు చెల్లించలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తే తమకు కమిషన్ వస్తుందని ఆశపడి భార్యాభర్తలిద్దరూ యువకుల నుంచి డబ్బు వసూలు చేశారు. వసూలు చేసిన డబ్బులు మధ్యలో ఉండి వేరొక వ్యక్తికి ఇప్పించడంతో సదరు వ్యక్తి వీరిని మోసం చేశాడు. ఈ క్రమంలో బాధితులు ఈ దంపతులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తమ పరువు పోయిందనే మనస్తాపంతో వారు ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. పీఎం పాలెం సీఐ వై రామకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.