Congress Working Committee on Polavaram: 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం' - Congress Working Committee news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 5:28 PM IST
Congress Working Committee on Polavaram: కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి.. చివరి గ్రామం వరకు నీటిని అందిస్తామని.. సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను ఈనెల 9వ తేదీన దిల్లీలో జరగబోయే సమావేశంలో ఇండియా కూటమితో చర్చించి, ఒప్పించి ఎన్నికలకు వెళతామన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో పోలవరం పనులు 80శాతం పూర్తి అయ్యాయన్న రఘువీరారెడ్డి.. గత ఐదేళ్లలో ఒక అంగుళం కూడా పనులు జరగలేదని మండిపడ్డారు.
Pallamraju,Tulsi Reddy Comments: రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని.. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడానికి సీఎం జగన్ ఎలాంటి చొరవ చూపడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అంశాలన్నిటినీ నెరవేరుస్తుందన్నారు. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు దశాబ్ధం కాలం నుంచి నత్తనడకనే సాగుతోందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన శ్రద్ధ చూపడం లేదన్నారు. మరోవైపు ఎన్డీఏలో ఉండి రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తామని తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి నంబర్ వన్ ద్రోహీ బీజేపీ అయితే.. నెంబర్ టూ ద్రోహీ వైఎస్సార్సీపీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న భాజపాతో ఏవిధంగా రాష్ట్ర సుస్థిరాభివృద్ధి సాధిస్తారో పవన్ కల్యాణ్ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఈనెల 21న కర్నూలు జిల్లా మంత్రాలయంలో మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోందని వెల్లడించారు.