Chit Victims Protest In Vijayawada: చీటీల పేరుతో రూ. 5 కోట్లకు టోకరా.. ఆందోళనకు దిగిన మధురానగర్ వాసులు! - కృష్ణా వార్తలు
🎬 Watch Now: Feature Video
Chits Fraud In AP : చీటీల పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.5 కోట్లకు బురిడీ కొట్టి, ఉడాయించిన సంఘటన కృష్ణా జిల్లా విజయవాడ పరిధి మధురానగర్లో చోటుచేసుకుంది. ఖాతాదారులకు ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఈ విషయం వెలుగు చూసింది. రోజువారి చీటీలు కట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడంటూ మధురానగర్ వాసులు నిరసన బాట పట్టారు. అదే ప్రాంతానికి చెందిన పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి సుమారు 40 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ రోజువారి చీటీలు కట్టించుకున్నట్లు తెలిపారు. గత కొంతకాలం వరకు క్రమం తప్పకుండా ఖాతాదారులకు చీటీల డబ్బులు చెల్లించేవాడని, ఇటీవల మాత్రం డబ్బులు అడుగుతుంటే రేపు మాపు అంటూ కాలయాపన చేసినట్లు వివరించారు. కొంతమందికి ఐపీ నోటీసులు రావడంతో అతని ఇంటి వద్దకు వెళ్లామని.. అప్పుడే తను పరారీ అయినట్టు తెలిసిందని అన్నారు. సుమారు 5 కోట్ల రూపాయల వరకు బాధితులకు చెల్లించాలని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వందలాదిమంది ఒక్కసారిగా బీఆర్టీఎస్ రోడ్డు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఘటనాస్థలానికి విజయవాడ సెంట్రల్ ఏసీపీ భాస్కర్ రావు చేరుకొని వారిని సముదాయించి ఆందోళన విరమింపచేశారు. బాధితులందరు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి, న్యాయం చేస్తామని ఏసీపీ తెలిపారు.