Child Died After a Rock Fell on His Head: పుట్టినరోజునే తిరిగిరాని లోకాలకు.. స్కూల్లో తల మీద బండ పడి చిన్నారి మృతి - Accident news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 10:45 PM IST
Child Died After a Rock Fell on His Head: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట స్కూల్లోని తరగతి గదిలో బండ మీద పడడంతో యూకేజీ చదువుతున్న కీర్తన (5)అనే చిన్నారి మృతి చెందింది. ఈ రోజు ఉదయం తన పుట్టినరోజు కావడంతో కొత్తబట్టలు ధరించి పాఠశాలకు చేరుకుని, తోటి చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందంగా గడిపింది. అంతవరకు ఆనందంగా గడిపి అలసిపోయి తరగతి గదిలో సేదతీరింది. అలా పడుకొని ఉన్న సమయంలో బండ ఒక్కసారిగా మీద పడింది. దీంతో తీవ్ర గాయాల పాలైన కీర్తనను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కీర్తన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటున్న రోజే.. చిన్నారి మృతి చెందడంతో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కీర్తన తల్లిదండ్రుల రోదనను ఆపడం ఎవరితరం కాలేదు. వారు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్న రెండవ పట్టణ పోలీసులు.. పాఠశాలకు వెళ్లి సంఘటన జరిగిన తీరును గురించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేస్తూ విద్యార్థి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రైషియా చెల్లించి న్యాయం చేయాలని.. అలానే నిబంధనలు పాటించని పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.