Chandrababu and Lokesh Cases: చంద్రబాబు బెయిల్ పిటిషన్​పై​​ విచారణ వాయిదా.. 12 వరకు లోకేశ్​ను అరెస్ట్​ చేయొద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశం - లోకేశ్ బెయిల్ వైసీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 6:12 PM IST

Updated : Oct 5, 2023, 6:28 AM IST

Chandrababu and Lokesh Cases:  చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై.. విజయవాడ ACB కోర్టులో విచారణ వాయిదా పడింది. రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంతకముందు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవుని.... అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సునీత అధ్యయనం చేసిన తర్వాత సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయన్నారు. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్‌ ధరను నిర్ధరించిందని.. ఆ కమిటీలో చంద్రబాబు లేరని న్యాయవాది దూబే తెలిపారు. కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారన్నారని... సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు ఆ బెయిల్‌ను పొడిగించిందని గుర్తు చేశారు. 

చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని... తర్వాత విచారణ చేపట్టారని న్యాయవాది దూబే కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారని దుబే తెలిపారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.‍.. అవసరం ఏముందని ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్నారు. రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు దృష్టికి తెచ్చిన దూబే.... కేబినెట్ నిర్ణయంపై సీఎంలను తప్పుపట్టడం సరికాదన్నారు. అలాగే వివిధ కోర్టుల తీర్పులనూ న్యాయవాది దూబే ఉదహరించారు. సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదని... సంతకం చేసిన గంటా సుబ్బారావు బెయిల్‌పై ఉన్నారన్నారు. కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపిందని దూబే వ్యాఖ్యానించారు. పెండ్యాల శ్రీనివాస్, వాసుదేవ్ అంశాన్ని ప్రస్తావించిన న్యాయవాది దూబే.... వారు నోటీసులు అందుకున్నారని తెలిపారు. శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి.. ఆయన విదేశాలకెళ్తే చంద్రబాబుకు సంబంధమేంటిని వాళ్లు విదేశాలకెళ్తే.. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పడం సబబా? ‌అని దూబే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అనంతరం ప్రభుత్వం వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌.. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని, కస్టడీకి అనుమతించాలంటూ కోరారు. జీవో 4 రావడానికి ముందే సీమెన్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారని... సీమెన్స్ కంపెనీ పేరును వాడుకున్నారన్నారు. కేబినెట్ ఆమోదంతోనే ఒప్పందం జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు వెళ్లారని... విదేశాల్లో ఉన్న పెండ్యాల శ్రీనివాస్ పాస్‌పోర్ట్‌ సీజ్ చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. స్కిల్ కేసులో నిధులు దుర్వినియోగం ఆధారాలుంటే ఇవ్వాలని ఏసీబీ కోర్టు.. కేబినెట్ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం ప్రకారం జీవో ఇచ్చారన్న పొన్నవోలు... ఒప్పందం మాత్రం జీవోకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. సామాజిక, ఆర్థిక నేరాల్లో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీం తీర్పులున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. 

చంద్రబాబు పిటిషన్లపై భోజన విరామం అనంతరం మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు.. చంద్రబాబు చుట్టూనే తిరిగిందని పొన్నవోలు వాదించారు. ముద్దాయిలందరికీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత లబ్ధి చేకూరిందన్నారు. సీబీఐ హెచ్చరికతో అప్పటి ప్రభుత్వం కంటితుడుపు విచారణకు ఆదేశిందని పొన్నవోలు వాదించారు. ఆ విచారణను కూడా తర్వాత బుట్టదాఖలు చేశారన్నారు. వాంగ్మూలానికి విరుద్ధంగా అధికారులు మీడియాలో మాట్లాడుకున్నారని పొన్నవోలు వాదించగా.. జైలులో ఉన్న వ్యక్తి ఎలా ప్రభావితం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది.

12 వరకు అరెస్ట్​ చేయొద్దు: స్కిల్ డవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​పై హైకోర్టు విచారణ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదికి వాయిదా వేసింది. అప్పటివరకు లోకేశ్​ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్  డెవలప్ మెంట్ కేసులో నారా లోకేశ్  పేరు చేర్చలేదని గత విచారంలో సీఐడీ హైకోర్టుకి తెలిపింది. అయితే సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్​లో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ది పొందినట్లు పేర్కొన్నారని లోకేశ్  తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపధ్యంలోనే పిటిషనర్​ను అరెస్ట్ చేస్తారని ముందస్తు బెయిల్ దాఖలు చేసారని తెలిపారు. 

Last Updated : Oct 5, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.