Blue Whale ఆ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగలం.. భారీ చేపను చూసేందుకు ఎగబడిన ప్రజలు - blue whale dead body
🎬 Watch Now: Feature Video
Blue Whale in Srikakulam District: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే నిన్నటి నుంచి వానలు తగ్గినా వరద ప్రవాహం మాత్రం తగ్గటం లేదు. అటు సముద్ర జీవరాశులు సైతం అల్లాడిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని పాత మేఘవరం– డి.మరువాడ సముద్ర తీరాల మధ్య గురువారం సాయంత్రం భారీ నీలి తిమంగలం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఇది చూడటానికి సుమారు 24 అడుగుల పొడవు, సుమారు మూడు టన్నుల బరువుతో ఉంది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సమయంలో ఇది మరణించి ఉందని అక్కడి మత్య్సకారులు తెలిపారు. భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో ఈ నీలి తిమంగలంను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే నీలిరంగుతో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం.. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులు నుంచి అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ తిమంగలం చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.