Bike Washed Away కొట్టుకుపోయిన బైక్.. వాగు కష్టాలు వారికి కామనే.. కాని చూసే వారికే.. - అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకల ఉద్ధృతి
🎬 Watch Now: Feature Video
No Bridge in Paderu People Facing Problems 50 ఏళ్ల క్రితం ఆ కొండల్లో ఉండే గ్రామ ప్రజలు ఊరి బయటకు రావాలంటే తీవ్ర అవస్థలు పడేవారు. ఏళ్లు గడిచాయి.. ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు. కానీ ఆ కొండల్లోని ప్రజల పరిస్థితి ఇప్పటికీ మారలేదు. సరైనా రహదారి లేక, వాగులకు వంతెనలు లేక ఆ గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. ఎన్నో ఎన్నెన్నో.. ఉపాధ్యాయులు అక్కడి పిల్లలకు చదువు చెప్పడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజు గడ్డలు దాటాలంటే ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడటంతో వాగులు, వంకలు నిండిపోయాయి. అక్కడి ప్రజలు వాగులు వంకలు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోందనే వారి ఆవేదనను మాత్రమే మనం చూడగలం.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముంచంగిపుట్ట మండలం లక్ష్మీపురం పంచాయతీ బిరిగుడ వద్ద వాగు దాటేందుకు.. ఓ యువకుడు చేస్తున్న సాహసాన్ని చూస్తే, ఒక్కసారిగా ఒళ్లు గగుర్పాటు పడుతుంది. బైక్ను భుజాన పెట్టుకుని వాగు దాటే ప్రయత్నం.. ఊపిరి బిగపట్టేలా చేస్తుంది. చూసే వారికి అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ వారికి మాత్రం అది ప్రతి రోజు చేసే పనే. వారికి అది అలావాటైపోయింది. కానీ ఈ సారి మాత్రం వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అందుకే ఆ కుర్రాడు.. బైక్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. మరో యువకుడు సాయానికి వెళ్లాడు. కానీ, కొంత దూరం మోసిన తరువాత వాగు ఉద్ధృతికి కాలుజారి పడిపోయారు. దీంతో ద్విచక్ర వాహనం వాగులో కొట్టుకుపోయింది. అక్కడ ఉన్న వారు అప్రమత్తమై ప్రాణాలకు పణంగా పెట్టి ఆ ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. ఉద్యోగస్తులు, గిరిజనులు వారి వారి గ్రామాలకు వెళ్లేందుకు ఇలాంటి కష్టాలు నిత్యకృత్యాలు అయ్యాయి. ప్రభుత్వాలు మాత్రం కళ్లకు గంతలు కట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనలు నిర్మించాలని వారు వేడుకుంటున్నారు.