Beneficiaries Protest Collector for Plots: ఇళ్లు కట్టుకునేందుకు ఉపయోగపడని పట్టాలెందుకు.. కలెక్టర్‌ను అడ్డుకున్న లబ్ధిదారులు - Ibrahimpatnam News
🎬 Watch Now: Feature Video
Beneficiaries Protest Collector for Plots: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జగనన్న ఇళ్ల పట్టాల లబ్ధిదారులు.. అధికార వైసీపీ ప్రజాప్రతినిధుల నేతృత్వంలో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావును ప్రశ్నించారు. విజయవాడ శివారులోని గుంటుపల్లి, తుమ్మలపాలెం వాసులకు ఈలప్రోలు వద్ద 517 ఇళ్ల పట్టాలు కేటాయించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా.. స్థలాలు అప్పగించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని వారి నుంచి రూ.35 వేలు చొప్పున డబ్బులు వసూలు చేసి కూడా ఇళ్లు నిర్మించలేదని ఆవేదన చెందారు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఎంపీపీ, వైసీపీ నాయకులు, సర్పంచులు.. అధికారులను కలిసి పరిస్థితులను వివరించినా.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారని మండిపడ్డారు. "నా మట్టి- నా దేశం" కార్యక్రమంలో భాగంగా గుంటుపల్లి జడ్పీ హైస్కూల్‌కు జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, ఇతర అధికారులు వస్తున్నట్లు ముందస్తు సమాచారంతో ఇళ్ల లబ్ధిదారులు నేరుగా కలెక్టరు వద్దనే తమ గోడు చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కలెక్టరు విజయవాడ నుంచి గుంటుపల్లి జడ్పీ హైస్కూలు ప్రాంగణానికి చేరుకోగానే నిలువరించి.. తమ వద్ద ఉన్న ఇళ్ల పట్టా కాగితాలను కలెక్టరు ముందు పడేశారు. ఇళ్లు కట్టుకోడానికి ఉపయోగపడని పట్టాలు దేనికని మండిపడ్డారు. సమస్య పరిష్కారం కాకుంటే గ్రామస్థులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు.