బనగానపల్లె బస్టాండ్లో ప్లాట్ ఫాం పైకి దూసుకువచ్చిన బస్సు - మహిళకు గాయాలు - ఆర్టీసీ బస్సు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 2:58 PM IST
Banaganapalle RTC Bus Incident: నంద్యాల జిల్లా బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకొచ్చిన ఘటన ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. బస్సు ఒక్కసారిగా దూసుకురావడంతో అక్కడ ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్దగా ప్రమాదమేమీ సంభవించకపోవడంతో అక్కడున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా బనగానపల్లె ఆర్టీసీ బస్టాండులో బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫాం పైకి దూసుకు వచ్చింది. బస్సు బ్రేకులు ఫెయిలై ప్లాట్ ఫాం పైకి దూసుకు రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బనగానపల్లె నుంచి నంద్యాలకు వెళ్తున్న బస్సు ఐదో నెంబర్ ప్లాట్ ఫాం వద్దకు వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న ఓ మహిళకు స్వల్ఫ గాయాలయ్యాయి. అక్కడున్న ఆమె తండ్రి బస్సును గమనించి పక్కకు లాగడంతో స్వల్ఫ గాయాలతో బయటపడిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు ఎదురుగా ఉన్న దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్లాట్ ఫాం ఎత్తు తక్కువగా ఉండటంతోనే బస్సు దూసుకొచ్చిందని, ఎత్తుగా ఉంటే అక్కడే ఆగేదాని ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాట్ ఫాం ఎత్తు పెంచాలని కోరుతున్నారు.