ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రేక్షకులకు శుభవార్త.. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' తరహాలో కొత్త సినిమాలు
🎬 Watch Now: Feature Video
APSFL Services : ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ సంస్థ ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది. ఫైబర్ నెట్ సినిమాలను ఇకపై ప్రేక్షకులు ఇంటి వద్దనే కూర్చుని చూసే వెసులుబాటు కల్పించనుంది. థియేటర్ల మాదిరిగా.. ఫస్ట్ డే ఫస్ట్ షో తరహాలో కొత్త సినిమాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. సినీ రంగానికి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటీటిలో కొత్త సినిమాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని.. అదే విధంగా ఫైబర్ నెట్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటికే సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపినట్లు.. పెద్ద సినిమాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సినిమా సేవలను జూన్ 2న విశాఖపట్నం వేదికగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రారంభానికి రాజకీయ, సినీరంగం ప్రముఖులు హాజరవుతారని.. ఓటీటి మాదిరిగా నెలకొకసారి రీఛార్జీ కాకుండా 24గంటలకు ఒక్కసారి రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని దీనిని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇది ఓటీటీ మాదిరిగా కాకుండా నేరుగా లైవ్లో సినిమాలు వస్తాయని తెలిపారు.