APPF Comments on Margadarsi Case: 'మార్గదర్శిపై వేధింపులు కక్షపూరితం.. వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు' - రామోజీ గ్రూపు
🎬 Watch Now: Feature Video
APPF Comments on Margadarsi case: రాష్ట్రంలో కక్షపూరిత వాతావరణం కొనసాగుతోందని.. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మీద, ఎందరో మధ్య తరగతి ప్రజలకు ఆసరాగా ఉంటున్న మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం(APPF) అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు అన్నారు. మార్గదర్శి చందాదారులకు భయానక వాతావరణం సృష్టించి.. వారంతా ఒక్కసారిగా సంస్థ మీద పడేలా చేయాలనే భావన రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది రామోజీ గ్రూపు (Ramoji Group) సమస్య కాదని... చందాదారులకు జరగబోయే నష్టమని.. ఎందరో మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ చర్యలతో రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. అగ్రి గోల్డ్(Agrigold) ఆస్తులు, అప్పుల వివరాలు చూస్తే చందాదారులకు చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ విలువ ఉన్న ఆస్తులు ఉన్నాయని.. కానీ, ఒక భయానక వాతావరణం రావడంతో మొత్తం చందాదారులు ఆ సమస్య మీద ఒక్కసారిగా పడటంతో ఆ సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు.. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి గొప్ప కంపెనీలూ పక్క రాష్ట్రాలకు మారితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనం, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలే తప్ప.. ప్రభుత్వమే చందాదారులను సంస్థపై మీద పడండి.. ఫిర్యాదులు చేయండి అని పదేపదే చెప్పడం సరికాదన్నారు.