Tiger Migration: ప్రకాశం జిల్లాలో పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న స్థానికులు.. - పులి సంచారం న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-06-2023/640-480-18797479-1037-18797479-1687234429013.jpg)
Tiger Migration: నల్లమల అటవీ పరిధిలోని లోయ సమీప పల్లె వాసులను పెద్ద పులి సంచారం కలవర పెడుతోంది. గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోనే ఉంటూ లక్ష్మీపురంతో పాటు అయ్యవారిపల్లి, నాగులవరం, చింతమల్లెలపాడు పరిసరాల్లో తిరుగుతోంది. ఆయా గ్రామాల సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లోని నీటితో దాహం తీర్చుకుంటోంది. తాజాగా అయ్యవారిపల్లి పంచాయతీ చింతమల్లెలపాడు సమీపంలోని పెండ్లి రాజయ్య నీటి కుంట వద్దకు పెద్ద పులి రావడాన్ని జీవాల కాపరులు ఆదివారం గమనించారు. పులి జాడలను పొలాల దారుల్లో గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. కాకర్ల వెలిగొండ ప్రాజెక్ట్ ఆనకట్ట సమీపంలోని మొట్టిగొంది. పాలనరవ ప్రాంతాన్ని తన ఆవాసంగా మార్చుకున్నట్లు భావిస్తున్నారు. మూడు నెలలుగా ఈ ప్రాంతంలో పులి జాడ తరచూ కనిపిస్తున్నప్పటికీ అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రామస్థులను హెచ్చరించేలా సూచనలు కూడా చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇటీవల పలు ఆవుల్నీ కూడా వేటాడి చంపిందని ప్రజలు తెలిపారు. ఈ నల్లమల అడవిలో ఈ ప్రాంతంలో అడవి జంతువులైన జింకలు, అడవి మేకలు, ఇతర జీవాలు వంటివి అధిక సంఖ్యలో ఉండటం వల్ల పులి ఆహారానికి కొదవలేకుండా ఉండటంతో కూడా ఈ ప్రాంతాన్ని ఆవాశంగా మార్చుకుందని అధికారులు పేర్కొంటున్నారు.