AP High Court on Power Workers Strike విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి.. కానీ కొన్ని షరతులు..! - Court Verdict on Electricity Workers Strike
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 10:35 AM IST
|Updated : Sep 1, 2023, 4:54 PM IST
High Court Verdict on Electricity Workers Strike: విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈనెల 10 న ధర్నా చేసుకోవాలని సూచించింది. ఆ రోజు ఉదయం పదిన్నర నుంచి.. మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోపు ధర్నా జరుపుకోవాలని.. న్యాయస్థానం ఆదేశించింది. ధర్నాలో పాల్గొనే వారి ఆధార్ కార్డులను ముందుగానే పోలీసులకు చూపించాలని తెలిపింది. సమస్యలను పరిష్కరించాలంటూ నిర్వహించే ధర్నాకు అనుమతి కావాలంటూ ఇటీవల విద్యుత్ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయట్లేదని.. ధర్నా కార్యక్రమం మాత్రమే నిర్వహించాలని అనుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది మాధవరావు వాదనలను వినిపించారు. ధర్నా ఎస్మా కిందకు రాదన్నారు. మొత్తం 97 వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. ధర్నా కార్యక్రమంలో తక్కువ మంది ఉద్యోగుల పాల్గొంటారని.. న్యాయస్థానానికి తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు ఎస్మా కిందకు వస్తారని.. ధర్నా చేస్తే విధుల్లో అంతరాయం ఏర్పడుతుందని.. ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వారికి అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. షరతులతో కూడిన అనుమతినిచ్చింది.