భార్యాపిల్లలు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరా - పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
AP High Court Comment About Illegal Detention: అక్రమ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘనేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్భంధించారని దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు నెల్లూరు జిల్లా వేదాయపాలెం సీఐ, ఎస్సైలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వడ్లపల్లి విజయ్ కుమార్ అనే నిందితుడు జైలులో ఉండగా తీసిన ఫొటోతో అతని సతీమణి ఈ నెల 8వ తేదీన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. తన భర్తను అక్టోబర్ 25న తీసుకెళ్లి నవంబర్ 8న కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారని కోర్టుకు తెలిపింది.
ఓ వ్యక్తి కస్టడీలో ఎన్ని రోజులు ఉంచుతారని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. రోజూ భార్యాపిల్లలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రోజుల తరబడి అక్రమ నిర్బంధంలో ఎందుకు ఉంచాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులపై చర్యలు, పరిహారం ఇప్పించేందుకు తగిన ఫోరాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.