CS Review: పెండింగ్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష.. పనుల పురోగతిపై ఆరా
🎬 Watch Now: Feature Video
AP CS KS Jawahar Reddy review of pending projects: రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమీక్షలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశాలపై సమీక్షించిన సీఎస్.. అధికారులకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు.
నిర్దేశించుకున్న గడువులోపు పనులు పూర్తి చేయండి.. పోలవరం ప్రాజెక్ట్ సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఇప్పటివరకూ చేసిన పనుల పురోగతి, చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటితో పాటు పోలవరం నిర్వాసితుల సమస్యలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశాల గురించి అధికారులతో సమక్షించారు. అనంతరం నిర్దేశించుకున్న గడువుకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్, అవుకు టన్నెల్, హీర మండలం ఇరిగేషన్ ప్రాజెక్ట్, వంశధార-నాగావళి నదుల అనుసంధానం.. గొట్టా బ్యారేజీ రిజర్వాయర్ ప్రాజెక్ట్, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2 తదితర ప్రాజెక్టుల ప్రగతి గురించి సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదిలోపు పూర్తి చేసిన వాటిని ప్రారంభించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ విడుదలైన నిధులు, ఖర్చు చేసిన మొత్తం పనుల వివరాలు, ప్రాజెక్టుల నిర్వాసితులకు అమలు చేస్తున్న పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన అంశాలను గురించి ఆయన చర్చించారు.