Student unions fire on CM Jagan: నిరుద్యోగులకో న్యాయం.. సీఎం జగన్ బావమరిదికో న్యాయమా?: విద్యార్థి సంఘాలు
🎬 Watch Now: Feature Video
Student unions fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైయస్సార్ జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తన బావమరిది అయిన సురేంద్రనాథ్ రెడ్డిని అక్రమ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంతో మంది అర్హత కలిగిన నిరుద్యోగులు ఉన్నప్పటికీ.. వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తన బావమరిది కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కట్టబెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సురేంద్రనాథ్‌రెడ్డిని తక్షణమే అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఇది రాజ్యాంగ ఉల్లంఘన.. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ..''ముఖ్యమంత్రి జగన్.. ఆయన బావమరిది సురేంద్ర నాథ్ రెడ్డి కోసం యోగి వేమన విశ్వవిద్యాలయంలో అక్రమ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ అత్యంత దారుణం. ఇదివరకే సురేంద్రనాథ్‌రెడ్డి కడపలోని ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయంలో రిజిస్టర్‌గా పనిచేస్తున్నారు. నిరుద్యోగులకో న్యాయం-సీఎం జగన్ బావమరిదికో న్యాయమా..?. అంత ప్రేమ ఉంటే ఏదో ఒక క్యాబినెట్ హోదా ఇస్తే సరిపోయింది కదా. అంతేకానీ, ఎంతో బాధ్యతతో కూడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని ఇవ్వడం సమంజసం కాదు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అతని నియమకాన్ని రద్దు చేయాలి. లేదంటే ఉద్యమం చేస్తాం'' అని అన్నారు.