Annavaram: సీతారాములు పెళ్లి పెద్దగా.. వైభవంగా సత్యదేవుని కల్యాణం
🎬 Watch Now: Feature Video
Sri Satyanarayana Swamy Vari Kalyanam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి వైభవంగా సాగింది. పంపానదీ తీరంలో సత్యదేవుని పరిణయ మహోత్సవాన్ని.. కడు కమనీయంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు.. కల్యాణవేడుక చూసి మురిసిపోయారు. త్రిమూర్తి స్వరూపంగా.. భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న అనంతలక్ష్మి సత్యవతి సమేత అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం రాత్రి నేత్ర పర్వంగా సాగింది. సీతారాములు పెళ్లి పెద్దగా నిర్వహిస్తున్న ఈ వివాహ వేడుక వేదికను, అత్యంత సుందరంగా అలంకరించారు.
స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుందరంగా, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేదికపై ఆశీనులను చేసి అర్చకులు, పురోహితులు, పండితులు ఆధ్వర్యంలో కల్యాణ తంతు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందించారు. అయితే వేడుక చూడకుండానే మంత్రి అత్యవసర సమావేశం ఉందంటూ వెళ్లిపోయారు. స్వామి, అమ్మవార్ల మాంగళ్య సూత్ర ధారణ, జీలకర్ర బెల్లం, ముత్యాల తలంబ్రాలు తదితర ఘట్టాలు భక్తులను పరమానందం నింపాయి. వేలాదిగా వచ్చిన భక్తులకు ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.